సంతోషంగా దీపావ‌ళి చేసుకుని... కూలి పనికెళ్తుంటే...

శుక్రవారం, 5 నవంబరు 2021 (10:38 IST)
సంతోషంగా దీపావ‌ళి పండగ చేసుకుని మునుపటిలాగే కూలి పనికెళ్తున్న ఆ ఆరుగురి కుటుంబాల్లో ఓ గుర్తు తెలియని వాహనం యమపాశమై పెనువిషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లాలో దీపావళి మరుసటి రోజు ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
 
 
పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగులు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్రగాయాల‌పాల‌య్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులు, స్థానికులు.  వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో చనిపోయిన వారు, గాయపడిన వారంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన వారని గుర్తించారు. 
         
 
స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, లారీ ఢీ కొన్న సంఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ మద్యం మత్తులో ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు