ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించే రోజులు పోయాయి.. పక్కన ఉండే మనిషే తోటి మనిషికి సహాయ పడేందుకు ముందుకు రావడం లేదు. రోజు రోజుకూ మనిషిలో మానవత్వం చచ్చిపోతోంది. పరోపకారం అన్న మాట గుర్తుకు రావడం లేదు. ఎవరెలా పోతే నాకేంటి అనే ధోరణిలో ఉంటున్నారు. అసలు మనిషికి మనసుందా అన్న ప్రశ్నతలెత్తుతోంది ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి మృతదేహంతో పాటు రెండు కిలోమీటర్లు తీసుకెళ్లాడో కసాయి.
ఆ వివరాలను పరిశీలిస్తే...నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు(35) రాత్రి 9 గంటల సమయంలో 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల కొత్తబస్టాండు సమీప పైవంతెన సమీపంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు(ఏపి28సికె 8477) అతన్ని ఢీకొట్టింది. యాక్సిడెంట్ అయ్యాక కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండానే కారును ఆపకుండా వేగంగా దూసుకుపోయాడు. అయితే కారు ఢీకొన్న సమయంలోనే ఆ వ్యక్తి ఆమాంతం కారుమీద పిట్టలా ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
కారుపై ఉన్న వ్యక్తి శరీరంనుంచి రక్తం ధారలుగా కారుతున్నా పట్టించుకోకుండా దాదాపు 3కిలోమీటర్ల దూరం ప్రయాణం కొనసాగించాడు. ఇదంతా గమనించిన స్థానికులు, పోలీసులు వెంబడించడంతో మాచారం సమీపంలో కారు వదిలి పారిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్టు గుర్తించి.. మృతదేహాన్ని బాదేపల్లి ఆసుపత్రికి తరలించారు. కారు వివరాలు ఆరా తీస్తున్నట్లు జడ్చర్ల ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.