బ్రహ్మానందం టైటిల్ మాకు దొరకలేదు. బ్రహ్మా ఆనందం అని చివరకు మార్చాను. మా టీంలోని కో డైరెక్టర్ వీరు ఆ టైటిల్‌ను డిజైన్ చేశారు. నా ప్రతీ సినిమాను సొంతంగానే నిర్మించాను. ఈ మూవీని కూడా నా బ్యానర్ మీదే సొంతంగానే తీశాను. ఎలాంటి కొలాబరేషన్ పెట్టుకోలేదు అని బ్రహ్మా ఆనందం నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు.
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి బ్రహ్మా ఆనందం అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు.. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా చిత్ర విశేషాల్ని ఇలా తెలియజేసారు.
* తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా తాత కూడా నన్ను సక్సెస్ ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ మళ్లీ రావా టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాత గారికి నివాళిలా ఈ సినిమా ఉంటుందని కథకు ఓకే చెప్పా.
* బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు అప్రోచ్ అయ్యారు. బ్రహ్మానందం గారు నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందం గారికి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ను చూడనటువంటి పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు.
* ప్రస్తుతం బ్రహ్మానందం గారు ఎక్కువగా సినిమాల్ని చేయడం లేదు. చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రంగమార్తాండ చూశాక ఆడియెన్స్ బ్రహ్మానందం గారిని చూసే కోణం మారిపోయింది. కమెడియన్ అంటే కేవలం నవ్విస్తారనే ముద్ర వేస్తాం. కానీ బ్రహ్మానందం గారు అద్భుతమైన నటులు. ఈ కథ నచ్చి బ్రహ్మానందం గారు వెంటనే ఓకే చెప్పారు.
* హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం గారు రికమండ్ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ పంపాం. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నారు. హీరో బ్రహ్మా కారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ కారెక్టర్ గిరి బాగుంటుంది చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు. ఆ తరువాత రాజా గౌతమ్ గారి పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ అతను చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది. అతని షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానం నాకు చాలా నచ్చింది.
* సినిమాని కొన్ని లెక్కలతో తీస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. లిమిటెడ్ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో సినిమా చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. నాకు పెద్ద లాభాలు రావాలని కూడా ఉండదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటా. కోటి మంది ఆడియెన్స్ ఉన్నారనుకుంటే.. వంద రూపాయలు సగటు అనుకుంటే.. వంద కోట్ల కలెక్షన్స్ వస్తాయి.. కానీ నాకు ఆ వంద కోట్లు అవసరం లేదు. నాకు ఓ ఇరవై కోట్లు వచ్చినా చాలు.
* బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే నేను హిట్లు, ఫ్లాపు గురించి చెప్పను. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అతని పర్ఫామెన్స్, యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.
* తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఓ అందమైన కథ. వినోదాత్మకంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది.
* స్క్రిప్ట్ చదవడం, కథ తెలుసుకోవడం అనేది నిర్మాత ప్రథమ బాధ్యత. సినిమాకు ఏ టెక్నిషియన్ ఉంటే బాగుందో చర్చించడం, మంచి సినిమాను జాగ్రత్తగా తీయడం అనేది నిర్మాత బాధ్యత.
* రాజా గౌతమ్‌తోనే మళ్లీ వైబ్ అనే ఓ సినిమాను చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు తెరెకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం సినిమా తరువాత ఆడియెన్స్‌కు రాజా గౌతమ్ ఏంటో అర్థం అవుతుంది. కథా చర్చలు జరిగే టైంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కానీ ఆ కథలోని సోల్ మిస్ కాకుండా చూసుకుంటాం.