అక్కిరాజు హరగోపాల్ ఇకలేరు.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ

శుక్రవారం, 15 అక్టోబరు 2021 (13:42 IST)
మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇకలేరు. ఆయన మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ అధికారికంగా ధృవీకరించింది. ఆయన బుధవారం ఉదయం 6 గంట‌ల‌కు మృతి చెందిన‌ట్లు పార్టీ కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మావోయిస్టు పార్టీ అధికార ప్ర‌తినిధి అభ‌య్ పేరుతో ఆర్కే మృతిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.
 
గ‌త కొంత‌కాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో ఆర్కే బాధ‌ప‌డుతున్నార‌ని, చికిత్స అందించిన‌ప్ప‌టికీ కాపాడుకోలేక‌పోయామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. డ‌యాల‌సిస్ చేస్తుండ‌గానే ఆర్కే ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. ఆర్కే మృతి పార్టీకి తీర‌ని లోటు అని మావోయిస్టు కేంద్ర క‌మిటీ ప్ర‌క‌టించింది. పార్టీ శ్రేణుల స‌మ‌క్షంలోనే ఆర్కే అంత్య‌క్రియ‌లు పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు.
 
కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ అడవుల్లో గురువారం ఆర్కే తుదిశ్వాస విడిచినట్టు బుధవారం రాత్రి వార్తలు వెలువడిన విష‌యం తెలిసిందే. అయితే ఇటు మావోయిస్టు పార్టీగానీ, అటు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులుగానీ ఆర్కే మృతిని ధ్రువీకరించలేదు. మొత్తానికి మావోయిస్టు పార్టీనే శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆర్కే మృతిపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తుమ్మకోట గ్రామం. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీలో చేరారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. 
 
ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. పలు ఎన్‌కౌంటర్లలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన శాంతిచర్చల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా ప్రభుత్వాలు రూ.97 లక్షల రివార్డును ప్రకటించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు