చైతన్య స్ఫూర్తిని కోల్పోయాం: వంగపండు మృతిపై మంత్రి బొత్స దిగ్భ్రాంతి

మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:36 IST)
సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని  వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దశాబ్దాల తరబడి కళా సేవ చేస్తూ, జన పదాలతో  ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు , ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధించారు.
 
తెలుగు సాహితీ కళారంగ చరిత్రలో మేరుశిఖరం
ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు అని.. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు.

జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు.

వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని..వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు