ఏపీ అసెంబ్లీలో తన భార్యను అల్లరి చేసుకుంటుంది చంద్రబాబేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ పాయింట్ లో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఇలాంటి భర్త, కొడుకు ఉండటం భువనేశ్వరి దురదృష్టం అని పరోక్షంగా ఆయన చంద్రబాబు, లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డారు.
చంద్రబాబు వరద ప్రాంతాలకు వెళ్ళింది బాధితుల పరామర్శకా, లేక తన సింపతీ కోసమా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు, కొడుకులే ఊరూరా తిరిగి భువనేశ్వరి పరువు తీస్తున్నారని, రాజకీయంగా బతకడం కోసం భార్యను చంద్రబాబు రోడ్డు మీదకు తెచ్చాడని ఎద్దేవా చేశారు. కుంటి సాకులతో అసెంబ్లీని వదిలేసి వెళ్ళిన చంద్రబాబు వరదల్లో బురద రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు.
వరద సహాయక చర్యలకు ఇబ్బంది రాకూడదనే సీఎం ఆయా ప్రాంతాల్లో తిరగడం లేదని, కాస్త కుదుటపడ్డాక సీఎం పరామర్శ చేస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు. వరదల్లో ప్రజలు కష్టాల్లో ఉంటే... మీ సొల్లు పురాణం అవసరమా బాబూ? అని నాని ప్రశ్నించారు.
వరదల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా 95 వేలు, ఇల్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ఒక్కొక్కరికి, మొత్తంగా 2లక్షల 80వేలు ఇవ్వాలని సూచించారని చెప్పారు. అదే విధంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.5,200 అందివ్వడంతోపాటు, వారికి పూర్తిగా నిత్యవసర వస్తువులు అందచేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయినవారికి రూ.5,500 ఇస్తున్నామన్నారు. అక్కడ వాతావరణం కుదుటపడి, బాధితులు తేరుకున్న తర్వాత బాధిత కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రిగారు పరామర్శించనున్నారని నాని తెలిపారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయసు వచ్చినా ఇంకా బుద్ధి, జ్ఞానం మాత్రం రాలేదని, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, వైయస్సార్ సీపీ శాసనసభ్యులు ఏదో అన్నారంటూ కుంటి, గుడ్డి సాకులు చెప్పుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
ఆయన భార్యను ఏమన్నారో కూడా చెప్పడు. నా భార్యను అవమానించారని మాత్రం చంద్రబాబు చెబుతున్నాడు. ఆవిడ పేరును మేంగానీ, మరే ఇతర సభ్యులు గానీ ప్రస్తావించలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా చంద్రబాబు వినడం లేదన్నారు. నాడు ఎన్టీఆర్‌ను, ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు పెద్ద దుర్మార్గుడు అని ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు కూడా తెలుసు. వారు పిలిచినా పలికే స్థితిలో లేరని, ఆ కుటుంబంలో పుట్టిన తన భార్యను రోడ్డు మీదకు తీసుకువస్తే.. వారంతా తనకు మద్దతు ఇస్తారని, ఎన్టీఆర్‌ను ఆదరించే వారు కూడా తనకు మద్దతు ఇస్తారన్నే పన్నాగం పన్ని, రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
ఈ ఊరు లేదు, ఆ ఊరు లేదు.. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా కలిసి ఆవిడను అల్లరి అల్లరి చేస్తోన్న పరిస్థితిని చూస్తున్నాం. తన రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డుమీద పెట్టగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది ఒక్క చంద్రబాబు నాయుడే అని నాని ఘాటుగా విమర్శించారు.