రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? చేతగాకపోతే తప్పుకోండి!

మంగళవారం, 23 నవంబరు 2021 (13:20 IST)
కొండపల్లిలో విధ్వంసం సృష్టించి వరుసగా రెండో రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడాన్ని చూస్తే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోంద‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజిపిలు విధులు నిర్వర్తించడం చేతగాకపోతే, తమ పదవుల నుంచి తప్పుకోవాల‌న్నారు. 
 
 
విజ‌య‌వాడ ఎంపి కేశినేని నానితో కలిపి తెలుగుదేశం పార్టీకి 16మంది సభ్యుల బలం ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. చైర్మన్ స్థానాన్ని గెల్చుకోవడానికి అవసరమైన బలం టిడిపికి ఉండగా, విధ్వంసం సృష్టించి రెండుసార్లు ఎన్నిక వాయిదా వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే అన్నారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అడ్డుకునే బదులు, అధికారపార్టీకి చెందిన వారినే చైర్మన్ గా నియమించుకోండ‌ని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను భయపెట్టి బలవంతంగా తమవైపు తిప్పకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. 
 
 
మారణాయుధాలతో ఎన్నికల‌తో సంబంధం లేని వైసిపి నేతలు కొండపల్లిలో గందరగోళం సృష్టిస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక జరగకుండా చేసేందుకు వైసిపి నేతలు ఎంత విధ్వంసం సృష్టించినా టిడిపి సభ్యులు అత్యంత క్రమశిక్షణతో, ఓర్పుతో వ్యవహరిస్తున్నార‌ని కితాబు ఇచ్చారు. తమ‌ సహనాన్ని చేతగానితనంగా పరిగణించవద్ద‌ని,  చట్టప్రకారం ప్రజాస్వామ్య బద్ధంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విజ్జప్తి చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు