చంద్ర‌బాబుకు పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా సీపీఐ రామకృష్ణ

శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:48 IST)
రాష్ట్ర దళిత హోంమంత్రిని కించపరిచినా, వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్న బలహీనవర్గాలకు చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి చేసినా, స్పందించని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చంద్రబాబుకు తొత్తుగా, బాబు ఏం చెబితే దానిని సమర్థిస్తూ, ఆయనను వెనకేసుకొస్తూ మాట్లాడటం సిగ్గు చేటు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. 
 
తిరుపతిలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీపీఐని  అడ్డుపెట్టుకొని, నెలనెలా బాబు దగ్గర డబ్బులు తీసుకొని, ఆయనకు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లా రామకృష్ణ మాట్లాడుతున్నారని, ఈ రోజు ప్రజలు అనుమానిస్తున్నారని తెలిపారు. సీపీఐ, సీపీఎంలలో ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు త్యాగాలు చేసి ప్రజల పక్షాన పోరాడారన్నారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి  పరిపాలనలో కమ్యూనిస్టులు ఎటువంటి పోరాటాలు చేయకుండానే 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 
 
ప్రజల సంక్షేమం కోసం, ఎవరూ అడగకుండానే, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, నేరుగా వారి ఖాతాల్లోనే లక్షా 40 వేల కోట్లు నగదు బదిలీ చేశామన్నారు. ఇవన్నీ రామకృష్ణకు కనిపించలేదా అని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి... దళితులను, బలహీనవర్గాలను చులకన చేసి మాట్లాడుతున్న టీడీపీ నేతలను సమర్థిస్తూ, రామకృష్ణ రాష్ట్రంలో చీడపురుగులా తయారయ్యారని విమర్శించారు. 
 
టీడీపీ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత, బడుగు, బలహీనవర్గాలపై వివక్షత ఉందన్నారు. ఇందుకు నాటి చంద్రబాబు పాలనలో దళితులకు జరిగిన అవమానకర సంఘటనలే నిదర్శమని అన్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పరిపాలనను అందిస్తోన్న  ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాపాలన చూసి ఓర్వలేకే ఆయనపై టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. 
 
గతంలో చంద్రబాబు నాయుడే దళితులుగా ఎవరు పుట్టాలనుకోరని వ్యాఖ్యానించి దళిత జాతిని అవహేళన చేశారన్నారు. టీడీపీ నేతలు సైతం దళితులపై దాడులు చేసి కించపరిచిన సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయన్నారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడమేకాక, దళిత హోం మంత్రి సుచరితపై అవమానకరంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఈ విమర్శలను ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఖండించకపోవడం, అయ్యన్న వ్యాఖ్యలపై క్షమాపణ కోరకపోవడం దారుణమన్నారు. 
 
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను నిరసిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెలుతున్న ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ రౌడీమూకలు, గూండాలు రాళ్లతో దాడి చేయడం శోచనీయమన్నారు. కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతూ.. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి, దాడులకు పాల్పడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టేంచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు