నగరి ప్రజలకు పుట్టినరోజునాడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోజా.. ఏంటది..(Video)

శనివారం, 17 నవంబరు 2018 (21:42 IST)
ఫైర్ బ్రాండ్ రోజా రూటు మార్చారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు కొత్తదారి ఎంచుకున్నారు. నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిధులు ఇవ్వకపోయినా తన సొంత నిధులతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న రోజాకు ఈసారి ఎన్నికల్లో తిరుగులేదంటున్నారు.
 
రోజా. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత రెండవ స్థాయి నాయకురాలిగా కొనసాగుతున్నారు. రోజాకు ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరుంది. ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోను తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో తలపండిన నేతలు ముద్దుక్రిష్ణమనాయుడు, చెంగారెడ్డి లాంటి వ్యక్తులను ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు భయం పుట్టించారు. తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. 
 
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌‌తో పాటు కేబినెట్‌లోని మంత్రులందరిపైన తనదైన శైలిలో విమర్శల వర్షం గుప్పిస్తుంటారు. ఒకానొక దశలో రోజాను విమర్శించడం మానుకున్నారు టిడిపి నేతలు. అంతేకాదు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం రావడం లేదని, నియోజకవర్గంలో అభివృద్థి ఎలా చేయాలని కూడా ప్రశ్నల వర్షం సంధించేవారు. అయితే చివరకు తన సొంత డబ్బులతో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా నగరిలో వైఎస్ఆర్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం 4 రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమమిది. తన సొంత డబ్బులతో వైఎస్ఆర్ క్యాంటీన్‌ను నడుపుతానని చెబుతున్నారు రోజా. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తానని చెప్పి నాలున్నర సంవత్సరాల తరువాత ప్రారంభించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 
 
నగరి నియోజకవర్గంలో నిరుపేదలకు కేవలం 4 రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తానని, అన్నా క్యాంటీన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ కాదంటున్నారు రోజా. ఇకపోతే ఈరోజు వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగలో రాజ్యసభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి అందించిన నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు ప్రారంభోత్సవం, ఇతర సిమెంటు రోడ్డు పనులకు భూమిపూజ కార్యక్రమం అంగన్వాడి భవనానికి భూమి పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు విజయసాయిరెడ్డి, రోజా ఇతర నాయకులపై పూలవర్షం కురిపించారు. చూడండి వీడియోను..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు