ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యడిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా ఘాటైన విమర్శలు చేశారు. వీరిద్దు అవిభక్త కవలలని, వారిద్దరూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు పుట్టారంటూ మండిపడ్డారు.
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మాకు అవకాశం ఉంటే నేను, వెంకయ్య అమెరికాలో పుట్టేవాళ్లం అని చంద్రబాబు అన్నారనీ, వీళ్లిద్దరూ కలిసి అమెరికాను ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలి అని సూచించారు.
మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయంట.. ఈయన కోటీశ్వరుడి కొడుకు కాదు, రెండెకరాల నుంచే వచ్చారు. అంత అహంకారం ఎందుకు? ప్రపంచంలో గొప్ప కట్టడాలన్నీ భారతీయులే కడుతున్నారు. నాసాలో 50 శాతం మంది భారతీయ ఇంజనీర్లే ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
పిల్లి గడ్డం, పిచ్చి గడ్డం ఉంటే చాలు, వారు గొప్పవారని చంద్రబాబు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్వదేశీ ఇంజనీర్లను కాదంటూ సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణాలు అప్పజెప్పారని ఆమె విమర్శించారు. మరోవైపు ప్రపంచం మొత్తం రష్యాతో ఒప్పందాలు వద్దనుకుంటుంటే, చంద్రబాబు మాత్రం రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆమె అన్నారు.
‘చంద్రబాబు ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశానని చెప్పుకుంటున్నారు. పీహెచ్‌డీకి అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన పీహెచ్‌డీ పట్టభద్రులు అయిపోరు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉంటూ మన ప్రజలను చంద్రబాబు ఇంతగా కించపరుస్తున్నారు. చంద్రబాబుకి అంత అహంకారం ఎందుకు? ఆయన మళ్లీ అధికారంలోకి రారు. భారతదేశాన్ని అవమానిస్తున్నారు. భరత మాత కాళ్లు పట్టుకొని చంద్రబాబు క్షమాపణలు అడగాలి అని డిమాండ్ చేశారు.