ఎమ్మెల్సీగా నారా లోకేష్.. ఆ తర్వాత ఏపీ కెబినెట్ మంత్రి కూడా?

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:41 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శాసనమండలి సభ్యుడు కావడం తథ్యమైపోయింది. తన కుమారుడిని ఎమ్మెల్సీ చేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి పంపించాలని ఆదివారం పొలిట్ బ్యూరో సూచించింది.
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం దాదాపు 3 గంటలపాటు సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు లోకేష్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌ను ఎమ్మెల్సీగా చేయాలని చంద్రబాబుకు సూచించారు. నేతల ఒత్తిడితో చంద్రబాబు సూచన ప్రాయంగా సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది. 
 
నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీగా తీసుకోవడంపై చర్చ జరిగిన నేపథ్యంలో... ఆయన మంత్రివర్గంలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అనేకంగా ఆయనకు ఐటీ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే లోకేశ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసేందుకు తెదేపా సన్నాహాలు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి