గవర్నర్ ను కలిసిన ఎంఎల్ సిలు తలశిల, లేళ్ల అప్పిరెడ్డి

శనివారం, 25 డిశెంబరు 2021 (12:48 IST)
కొత్త‌గా బాధ్యతలు తీసుకున్న శాసన పరిషత్తు సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రాజ్ భవన్ వేదికగా ఈ భేటీ జరగగా, గవర్నర్ వీరి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 
 
 
శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించగా, మంచి కార్యక్రమాలను తీసుకున్నారని కొనియాడారు.


పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించారు. మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు