టోక్యో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ లో సింధూ భారతదేశానికి కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచారు. ఆమె వరుసగా రెండు సార్లు ఈ పతకాలు సాధించడంతో మంచి క్రేజ్ లభించింది. చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల ఆలయానికి విచ్చేసిన సింధూకి ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. సింధు కుటుంబ సమేతంగా స్వామివారు, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అర్చకులు పి.వి.సింధుకు ద్వారకా తిరుమల క్షేత్ర మహిమ గురించి వివరించారు. ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికి, పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఆలయ ఈవో సుబ్బారెడ్డి స్వామివారి మేమేంటో అందజేశారు.
అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ, ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామివారిని గతంలో చాలాసార్లు దర్శించుకున్నానని, తనకు వెంకటేశ్వరునిపై అమితమైన భక్తి ఉందని తెలిపారు. తనపై స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకున్నానని, స్వామి వారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్తానని తెలిపారు.