రెడ్ జోన్ ప్రాంతాల్లో మరిన్ని మెడికల్ క్యాంపులు, ఫీవర్ క్లినిక్ లు: నీలం సాహ్ని

గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:10 IST)
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు కంటైన్మెంట్ విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

విజయవాడ నగరంలో కరోనా నియంత్రణ చర్యలపై గురువారం సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జూమ్ యాప్ ద్వారా డిజిపి గౌతం సవాంగ్,వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి,కృష్ణా జిల్లా కలెక్టర్,జెసి,విజయవాడ పోలీస్  కమీషనర్,మున్సిపల్ కమీషనర్, మార్కెటింగ్ శాఖ కమీషనర్లతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయవాడ,గుంటూర్,కర్నూల్  వంటి నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో కంటోన్మెంట్ విధానాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.రెడ్ జోన్లులో మెడికల్ క్యాంపులు,ఫీవర్ క్లినిక్ లను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు.
 
మరిన్ని పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు స్పష్టం చేశారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ళ నుండి బయిటకు రాకుండా వారికి కావాల్సిన కూరగాయలు,ఇతర నిత్యావసర వస్తువులు మొబైల్ రైతు బజారులు,ఇతర వాహనాలు ద్వారా ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ముఖ్యంగా విజయవాడ నగరం లో టెస్టులు ఎక్కువ చేయడం, కట్టుదిట్టమైన కంటైన్మెంట్ చర్యలు వంటి పటిష్ట చర్యలు చేపట్టడం ద్వారా రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమీషనర్ మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.
 
మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ అధికం అవుతున్నాయని అవి ప్రధానంగా ఏడు ప్రాంతాల్లోనే  అధికం వస్తున్నాయని తెలిపారు.
 
కృష్ణా జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 19 క్లస్టర్లకు గాను మూడు క్లస్టర్లలో అనగా కృష్ఢ లంక, కార్మిక నగర్, అజిత్ సింగ్ నగర్ లలోనే ఎక్కువ కేసులు ఉన్నాయని తెలిపారు.విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ నగరంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆలాంటి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు.
 
విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ క్వారంటైన్ లో ఉన్న వారికి 20రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నగరంలోని ప్రతి ఇంటికీ క్యూర్ కోడ్ తో కూడిన కార్డులను అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు