20 – 40 ఏండ్ల వయసు వారి ద్వారానే అధికంగా కరోనా వ్యాప్తి
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:52 IST)
కరోనా వ్యాప్తి కారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రకటన చేసింది. 20 నుంచి 40 ఏండ్ల వయసున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసయి మంగళవారం నాడు తెలిపారు.
ఇరవై నుంచి నలభై ఏళ్ల లోపు వారు తమకు తెలీకుండానే కరోనా బారినపడుతున్నారని అన్నారు. ఆరోగ్యంగానే ఉన్నామనుకుని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం మూలాల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తమకు కరోనా సోకిందన్న విషయం వీరిలో అనేక మందికి తెలియదని తకేషి చెప్పారు. ఈ పరిస్థితి వృద్ధులకు, అనారోగ్యంగా ఉన్నవారికి ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజారోగ్య వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.