విశాఖ జిల్లాలోని పంచ గ్రామాలపై ప్రభుత్వ నిర్ణ‌యాలివి...

శుక్రవారం, 26 నవంబరు 2021 (14:24 IST)
విశాఖపట్నం జిల్లాలోని పంచ గ్రామాలపై ప్రభుత్వం త్వ‌ర‌లో నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. దీని కోసం నియమించిన కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయ‌న మీడియా ప్రతినిధులకు వివరించారు. 
 
 
కోర్టులో ఉన్న కేసుల‌ని త్వరితగతిన డిస్పోజ్ చేయాలని చ‌ర్చ జ‌రిగింది. కోర్టుకి అందించిన నివేదిక ప్రకారం, 12,149 మంది నిర్వాసితులు అక్కడ నివాసం ఉంటున్నారని, వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. 100 గజాలు, 101 నుంచి 300 గజాలు, 300 గజాలు పైన స్థలాల్లో ఉన్న వారిపై ప్లాన్ ఆప్ యాక్షన్ ని కోర్టు ఆప్రూవ్ చేసినట్లు  అమలు చేసేలా సమావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు. 
 
 
2008లో గుర్తించిన 12,149 పంచగ్రామాల ఇళ్లలో కొన్ని ఇళ్లు వర్షాల వల్ల కూలిపోయాయ‌ని, వాటి మ‌ర‌మ్మ‌తుకు అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి తెలిపామని చెప్పారు. ఇక్క‌డి భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ కాపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని,  దేవాస్థానానికి సంబంధం లేకుండా, భక్తుల విరాళాల‌తో కాపౌండ్ వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెగ్యులరైజేషన్ అంశంలో కోర్టుకిచ్చిన ప్రతిపాదనలో 2008లో మార్కెట్ వాల్యూ ఒక అంచనా వేశారని, 0-100 గజాల వరకూ ఉచితం, 101-300 గజాల వరకూ 1998 వాల్యూలో 70 శాతం ఫీజు అని, 300 గజాలపైన ఉన్న వాటికి 1998లో వాల్యూలో 100 శాతమని, కమర్షియల్ యూనిట్స్ కి మార్కెట్ వాల్యూ ఉంటుందని తెలిపారు. సింహాచల దేవస్థానం భూములను కాపాడాలని, అక్కడ నివసిస్తున్న ప్రజలకు అన్యాయం జరగకూడదని ఈ సమావేశంలో చర్చించామ‌ని విజయసాయిరెడ్డి తెలిపారు.  

 
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పంచ గ్రామాల నిర్వాసితులకు న్యాయం జరిగేలా, దేవాలయానికి ఎటువంటి నష్టం లేకుండా చేయడానికి ఇప్పటికే ఒక అంచనా వేశామ‌న్నారు.  హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశామని, సింహాచల దేవాలయ అభివృద్ధి, దేవాలయాల స్థలాలను ఏ విధంగా కాపాడాలనే అంశాలపై చర్చించామ‌న్నారు. రానున్న రోజుల్లో సింహాచలాన్ని చక్కటి దేవాలయంగా అభివృద్ది చేసే లక్ష్యంతో కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు