తుని ఘటనకు ఆస్తులు విక్రయించి నష్టపరిహారం చెల్లిస్తా.. ఆంక్షలు కాపులకే వర్తిస్తాయా : ముద్రగడ

మంగళవారం, 22 నవంబరు 2016 (11:53 IST)
తుని ఘటనకు సంబంధించి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అదేసమయంలో ఆంక్షలు, నిబంధనలు కేవలం కాపు కులస్థులకే వర్తిస్తాయా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని.. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా.. లేదా 2019 లో జరిగే ఎన్నికల వరకు అమలు చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 
 
ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సన్నద్దమైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని పద్మనాభం... ఏపీ డీజీపీ సాంబశివరావును కోరారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. తుని ఘటనలో తనపై, తన జాతిపై వస్తున్న ఆరోపణలు రుజవైతే ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తానని ముద్రగడ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి