కాగా, ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ ఉద్యమాన్ని అణిచివేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా, యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా సైన్యం కాల్పులు జరిపింది.
మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. 'మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు' అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా 400 మంది అమాయకులు బలయ్యారు.
ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం విమర్శించింది.