గుంటూరు జిల్లా నడికుడిలో వింత వ్యాధి...

ఆదివారం, 13 డిశెంబరు 2020 (13:34 IST)
గుంటూరు జిల్లా నడికుడిలో వింత వ్యాధి వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోతున్నారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ వింత వ్యాధి అనేక మందికి సోకింది. దీనివల్ల వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. 
 
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ కొందరు స్థానికులు అస్వస్థతకు గురవుతుండటం అలజడి రేపుతోంది. వరుసగా కొందరు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. 
 
నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో గుర్తించి కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో అనంతరం గుంటూరు వైద్యశాలకు తరలించారు.
 
అనంతరం అదేగ్రామంలో మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోవడంకలకలం రేపుతోంది. అక్కడ ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ ఆ గ్రామస్థులు అంటున్నారు. 
 
కాగా, నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలోనూ ఆరుగురు రైతు కూలీలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు శనివారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు