టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తన తండ్రి చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లుకాగా, తన కుమారుడు నారా దేవాన్ష్ నికర ఆస్తులు విలువ రూ.11.54 కోట్లుగా ఉందని వెల్లడించారు.
ఆయన శుక్రవారం అమరావతిలో ఈ ఆస్తులను వెల్లడించారు. చంద్రబాబు తన కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించడం ఇది వరుసగా ఏడో యేడాది. యావత్ భారత్ దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఈ విధంగా తమ ఆస్తులను ప్రకటించలేదని అన్నారు. తన తండ్రి ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని, మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల్లోనూ మార్పులేదని లోకేశ్ పేర్కొన్నారు.
కాగా, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను విడుదల చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి నాడు తెరదీశారు. తమపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు వాళ్ల ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని, పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
కాగా, చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల వివరాలను పరిశీలిస్తే, చంద్రబాబు నికర ఆస్తులు రూ.2.53 కోట్లు, భువనేశ్వరి ఆస్తులు రూ.25.41 కోట్లు, లోకేశ్ నికర ఆస్తులు రూ.15.21 కోట్లు, బ్రహ్మణి నికర ఆస్తులు రూ.15.01 కోట్లు, దేవాన్ష్ నికర ఆస్తులు: రూ.11.54 కోట్లుగా ఉందని తెలిపారు. తమ కుటుంబానికి ఎక్కువ ఆదాయం హెరిటేజ్ సంస్థ నుంచి వస్తోందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ రూ.2600 కోట్లకు చేరుకుందని లోకేష్ వివరించారు.