ఏ1కు ధైర్యం లేదా? 420కి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది : నారా లోకేశ్

ఆదివారం, 3 జనవరి 2021 (16:21 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు నోటికి పనిచెప్పారు. రామతీర్థం ఘటనపై ఆయన మాటలతూటాలు పేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ 420గా అభివర్ణించారు. పైగా, అక్రమాస్తుల కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్‌కు లోకేష్ ఓ సవాల్ విసిరారు. తాను 420కి సవాల్ విసిరితే.. 840 మొరుగుతోందంటూ మండిపడ్డారు. పైగా, తనపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో రవ్వంత కూడా నిజం లేదని, కేవలం బురద జల్లేందుకు విమర్శలకు దిగుతున్నారని కౌంటరిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'నేను 420 జగన్‌ రెడ్డికి సవాల్‌ విసిరితే 840 మొరుగుతోందేంటి? ఏ 1కు దమ్ము, ధైర్యం లేదా? దైవం మీద ప్రమాణం అనగానే తోక ముడిచి, చర్చ అంటూ పారిపోతున్నారు. నాపై వైసీపీ చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని మరోసారి సవాల్‌. నాపై జగన్‌రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేసేందుకు నేను సిద్ధం. జగన్‌రెడ్డి సిద్ధమా?' అని నారా లోకేశ్ సవాల్ విసిరారు. 
 
అలాగే, ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు కూడా విమర్శలు గుప్పించారు. 'జగన్మోహన్‌ రెడ్డి క్రిస్టియన్‌ ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రాన్ని కులాలు, మతాల వారీగా విచ్ఛిన్నం చేస్తూ ప్రజల్లో అభద్రత కల్పిస్తున్నారు. సీఎం నాయకత్వంలో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి' అంటూ ఆరోపించారు. 
 
ఇకపోతే, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రామతీర్థం ఘటనపై స్పందిస్తూ, 'తోలుబొమ్మలాటలో విదూషక పాత్ర కేతిగాడికి సరిపోయే విజయసాయిరెడ్డి... 10 మంది పోకిరీలను వెంటేసుకొని బయలుదేరితే పోలీసులు ఆయనను అడ్డుకోకుండా అన్ని అనుమతులు తీసుకొని బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా ఆపుతారు? చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికే డీజీపీ గౌతం సవాంగ్‌ ఒక పథకం ప్రకారం విజయసాయి రెడ్డి పోటీ పర్యటనను రామతీర్థానికి పెట్టించారు' అని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు