ఆర్నెలల్లో మంచి ముఖ్యమంత్రి కాదు.. ముంచేసిన సీఎం : నారా లోకేశ్

ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:08 IST)
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డిగారు ఈ ఆర్నెల్లలోనే రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేశారు. 
 
విధ్వంసంతో ప్రారంభమైన వైకాపా ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్‌గా మార్చారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాసారు. 
 
ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం. సంక్షేమం సున్నా పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ గారు మహిళల్ని మోసం చేయడం, రైతులను దగా చేయడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజం. 
 
వృద్దులకు నెలకు రూ.250, రైతులకు 625 రూపాయిలు ఇస్తున్న జగన్ గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు రూ.8 వేలు ఇస్తూ ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్ టెండర్ పెట్టిన ఘనుడు జగన్. 
 
అన్న క్యాంటీన్లు, చంద్రబీమాతో పాటు.. చంద్రబాబుగారి హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసారు. ఆరు నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయి. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న హామీ ఎగిరిపోయింది. 3 వేల పెన్షన్ పోయింది. 
 
రైతు భరోసా 13,500 అని ఇప్పుడు 7,500 ఇస్తున్నారు. అమ్మ ఒడిని ఆంక్షల ఒడిగా మార్చారు. రత్నాలు వైకాపా నాయకులు మింగి రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారు. ఎంత మంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ గారి ప్రభుత్వం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు