సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపైనే కాదు.. అందరిపైనా ఉంది. పురుషులైతే ఇంటికొచ్చినా కూడా ఇంటి సమస్యలను పక్కనబెట్టి సోషల్ మీడియాను చూస్తూ కూర్చుంటారు. అలా ఖాళీ సమయాల్లో ఫేస్ బుక్ చాటింగ్‌తో కాలక్షేపం చేసే ఓ నేవీ ఆఫీసర్‌ను ఓ కి''లేడీ'' దారిలో పెట్టింది. అంతే ఆమె మాటలు నమ్మిన విశాఖ నేవీ ఆఫీసర్ మోసపోయాడు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ నేవీ ఆఫీసర్ హర్షుక్ ఫేస్ బుక్‌లో చాటింగ్ ద్వారా అమ్మాయి పరిచయమైంది. హర్షుక్‌తో మాట్లాడాలని ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది. ఫోన్ మాట్లాడితే డబ్బుల్లేవంది. ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేయడం తనకు తెలియదని హర్షుక్ చెప్పినా.. లింకు పంపింది. ఆ లింకు ద్వారా ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని నమ్మిన హర్షుక్.. అమ్మాయి పంపిన లింకుపై యాభై రూపాయలు రీఛార్జ్ చేశాడు.
అయితే హర్షుక్‌కి వెంటనే ఓ మెసేజ్ వచ్చింది. తన బ్యాంకు అకౌంట్ నుంచి 50 వేల రూపాయలు కట్ అయ్యాయంటూ వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. వెంటనే హర్షుక్ స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకి బదిలీ చేశారు. విచారణలో మాయలేడీ ఒరిజినల్ లింక్ పంపలేదని.. డబ్బులు కాజేసే ఈజీ లింకును పంపిందని.. ఆ డబ్బుతో మొబైల్ ఫోన్లు కొనేసిందని పోలీసులు తెలిపారు. బాగా చదువుకొని ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి కూడా మోసపోయాడని, ఇటువంటి వారిని నమ్మకూడదని పోలీసులు చెప్పారు.