రాత్రిపూట కర్ఫ్యూను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం

మంగళవారం, 11 జనవరి 2022 (22:21 IST)
రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని భావించింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూ అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలుకానుంది. ఇటీవల కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సవరణ చేస్తూ తాజాగా మరోమారు జారీచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని స్పందిస్తూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి పెరిగినప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్నిరకాల వైద్య సదుపాయాలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. 
 
అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేసే ఉల్లంఘించేవారిపట్ల కఠినంగా వ్యవహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యంగా, మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు