దేనిపట్లా భయం లేకపోవడమే సంపన్నుల పిల్లల మరణాలకు కారణమా?

గురువారం, 11 మే 2017 (04:32 IST)
సంపన్నుల పిల్లల్లో విచ్చలవిడితనమే వారి అర్ధాంతర మరణాలకు కారణమవుతోందా అంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స‌మాజంలో పలుకుబడి వున్న ప్రముఖుల పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని,  రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మరణించడం దురదృష్టకరమన్నారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
 
అయితే, ప్రముఖుల పిల్లల్లో విశృంఖలత్వం, విచ్చలవిడితనం పెరగటం చూస్తే భయమేస్తోందన్నారు. ధనవంతులు, చదువుకున్న వారి పిల్లలకు ఎవరి భయమూ లేకుండా పోతోందని, వారిలో సామాజిక బాధ్యత లేకుండా పోతోందన్నారు. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ అన్ని వయసుల్లోనూ ఎవరో ఒకరి భయం ఉండాలని, లేకుంటే పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తుందన్నారు. 
 
తల్లిదండ్రులు, పిల్లలు ఎవరి బిజీలో వారు పడిపోయారని, ఎవరేం చేస్తున్నారో గమనించే స్థితిలో కూడా లేకుండా గడుపుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. తన ఉద్దేశం ఒకర్ని తప్పుబట్టడం కాదని, సో కాల్డ్‌ హై సొసైటీలో ఈ జాడ్యం ఎక్కువగా ఉందని చెప్పటమే తన ఉద్దేశమన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో చూడాల్సిన బాధ్యతల తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ఎంత బిజీగా వున్నా ఎప్పుడో ఓసారి పిల్లల తీరును తల్లిదండ్రులు గమనించాలన్నారు.
 
నీ సంపాదన వారి కోసమే అనుకున్నపుడు.. వారు బాగా లేకపోతే కుటుంబ పేరు ప్రతిష్ఠలతో పాటు సమాజం పాడవుతుందనేది గమనించాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరంలో పబ్‌లు, బార్లలో అర్థరాత్రి 2 గంటల వరకూ ఏం చేస్తారో తనకు తెలియదన్నారు. సినిమాల్లో చూడటం మినహా నిజ జీవితంలో వాటి వైపే వెళ్లలేదన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కూడా ఇలాంటి వాటిపై నిఘా ఉంచి కట్టడి చేయాలన్నారు.
 

వెబ్దునియా పై చదవండి