ఇసుక మాఫియా ఆగడాలకు ముక్కుతాడు వేస్తూ నూతన పాలసీ ద్వారా వినియోగదారులకు ఇసుకను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయి.
ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత అనే మాట లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. గత మూడు నెలలుగా భారీ వర్షాలతో రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులతో పాటు అన్ని నదుల్లోనూ వరద పరిస్థితి కొనసాగింది.
దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 275 ఇసుక రీచ్ లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు తగ్గుముఖం పడుతుండగానే అవకాశం వున్న ప్రతి రీచ్‌లోనూ ఇసుకను వెలికి తీయడం ద్వారా భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను ముందుకు తీసుకువచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, జిల్లా కలెక్టర్ ల ప్రత్యేక పర్యవేక్షణ, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇసుక రీచ్ లను ప్రారంభించడం, పారదర్శకంగా స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల నుంచి ఇసుకను వినియోగదారులకు అందించే ప్రక్రియ గత వారం రోజుల్లో ఊపందుకుంది.
నదుల్లో గుర్తించిన ఇసుక రీచ్ లతో పాటు ప్రైవేటు పట్టాభూముల్లో ఇసుక మేటలను కూడా గుర్తించి, వారికి ఇసుక తవ్వకాలకు అనుమతులను జారీ చేసే విషయంలోనూ అధికార యంత్రాంగం వేగంగా పనిచేసింది. దీనితో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు మరింత ముమ్మరంగా జరిగాయి.
ప్రారంభంలో రోజుకు లక్ష టన్నులను లక్ష్యంగా పెట్టుకుని, ఇసుక వారోత్సవాలు పూర్తయ్యే నాటికి రెండు లక్షల టన్నుల ఇసుకను రవాణాకు సిద్దంగా వుంచాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఫలితాలను అందించాయి. వారోత్సవాలు ముగిసే (నవంబర్ 21) నాటికి ఏకంగా సుమారు 2.80 లక్షల టన్నుల లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా ఇసుక కొరత అనే మాటకు అవకాశం లేకుండా చేశారు.
ఇసుక ధరలకు ముక్కుతాడు...
రాష్ట్రంలో ఇసుక లభ్యత పెరగడంతో... ఇసుక ధరలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఇసుక వెలికితీత కోసం నిర్వహించిన టెండర్లలోనూ రివర్స్ టెండరింగ్ విధానంను అమలు చేయడం ద్వారా తక్కువ రేటుకే వినియోగదారులకు ఇసుకను అందించేందుకు మార్గం సుగమం చేసింది.
అంతేకాకుండా ఆయా స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల నుంచి ఏ ప్రాంతంలోని వారికి, ఎన్ని కిలోమీటర్లకు ఎంత రవాణా చార్జీలను చెల్లించాలో కూడా శాస్త్రీయంగా అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఆయా జిల్లాలకు జాబ్ కార్డ్ లను ప్రకటించారు. రవాణా చార్జీల భారం కూడా అధికంగా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనితో ప్రధాన నగరాల్లో కూడా ఇసుక రేట్లు నిర్మాణదారులకు అందుబాటులోకి వచ్చేశాయి.
గతంలో ఇసుక పై నియంత్రణ లేకపోవడంతో ఇసుక మాఫియా నిర్ణయించిన రేట్లకే వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వుండేది. పేరుకు ఉచిత ఇసుక అంటూ గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం ప్రజలకు అందలేదు. ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఇసుక విక్రయాలను క్రమబద్దీకరిస్తూ.. నూతన పాలసీని అమలు చేయడం ద్వారా అటు ఇసుక మాఫియా దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
ఇసుక వారోత్సవాల ప్రారంభం సందర్బంగా ఈనెల 14వ తేదీన 1,66,588 టన్నుల ఇసుక నిల్వలను వెలికితీశారు. దీనికి ముగింపు నాటికి 2.80 లక్షల టన్నుల వరకు పెంచడం ద్వారా ఇసుక కష్టాలకు చెక్ పెట్టారు. రాష్ట్రంలో రోజువారీ ఇసుక డిమాండ్ గరిష్టంగా 80వేల టన్నులు కాగా, వారోత్సవాల మొదటి రోజునే ఈ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం.
వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాలు, గుంటూరు, కడపజిల్లాల్లో కొత్తగా 17 రీచ్ లను ప్రారంభించారు. అలాగే తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో 12 పట్టాభూములకు అనుమతులు మంజూరు చేశారు.
అలాగే తూర్పు గోదావరి, చిత్తూరుజిల్లాల్లో జలాశయాల్లో మేట వేసిన ఇసుకను వెలికితీసేందరుకు రెండు అనుమతులు ఇచ్చారు. పదమూడు జిల్లాల పరిధిలో ముందుగా ప్రకటించిన దానికి అధనంగా 34 కొత్తస్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత, డిజిపి గౌతం సవాంగ్ తదితరులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీనిలో భాగంగా ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా రెండేళ్ల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు 14500 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇసుక అక్రమాలపై ఈ నెంబర్‌కు ఎవరు కాల్ చేసినా వెంటనే అధికారులు రంగంలోకి దిగేలా చర్యలు చేపట్టింది.
అలాగే ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 35కు పైగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసింది. సిసి కెమేరాల పర్యవేక్షణలో ఈ చెక్ పోస్టుల వద్ద ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడంతో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడింది.