ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన పాపికొండల పడవ ప్రయాణ విహారయాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. దీనికి కారణం ఏపీ రాష్ట్రంలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడమే. ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకుతోడు ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో పాపికొండల యాత్రను సోమ, మంగళవారాల్లో రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రను పునరుద్ధరిస్తామని పోశమ్మగుడి కంట్రోల్ రూమ్ మేనేజర్ రజిత్ తెలిపారు.
కాగా, సముద్రంపై ఆవరించివున్న ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం 6.30 గంటల సమయంలో రెండోసారి వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ అకాల వర్షం కారణంగా తిరుమాఢ వీధులన్నీ జలమయమయ్యాయి. పలు షాపింగ్ కాంప్లెక్స్‍లలోకి నీరు ప్రవేశించింది. దీంతో భక్తులు షెడ్ల కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.