నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు.. బ్యాంకర్లు చేసిన మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు నగరంలోని ప్రధాన బ్యాంకులో నల్ల కుబేరులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారి రూ.70కోట్ల కొత్త కరెన్సీ నోట్లను వారికి చేర్చేశారు. ఈ వ్యవహారంలో బ్యాంకులో నగదు లావాదేవీలు చూసే ఓ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ల రద్దు తర్వాత రెండో విడతగా ఆర్‌బీఐ నుంచి సదరు బ్యాంకుకు రూ.70 కోట్లు నగదు వచ్చిందని.. దానిని రాత్రికి రాత్రే రద్దు చేసిన నోట్లకు మార్పిడిచేసి నల్లకుబేరులకు బ్యాంకు అధికారులు చేర్చారని తెలుస్తోంది. పనిలో పనిగా సదరు బ్యాంక్ అధికారి కూడా రూ.45లక్షల రద్దైన నోట్లను మార్చుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఐటీ అధికారులు సమాచారం అందడంతో.. బ్యాంక్ అధికారుల గుట్టును రట్టు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు.