అసత్యాలతో ప్రజల్లో అయోమయాన్ని కల్పించాలని చంద్రబాబు యత్నం

శుక్రవారం, 3 జులై 2020 (10:36 IST)
ప్రతిపక్షనేత చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్‌ల ద్వారా కన్ను ఆర్పకుండా చెప్పిన అబద్దాలే మళ్ళీ చెబుతున్నారని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

తాడేపల్లిలోని వైయస్ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే ప్రజలు దానిని నిజం అని భావిస్తారనే గోబెల్స్ విధానాలనే చంద్రబాబు నమ్ముకున్నాడని విమర్శించారు.

గతంలో తనకు ఇదే విధానం అధికారంను అందించిందని, ఇప్పుడు కూడా మళ్లీ ఇదే విధానం ద్వారా అధికారం వస్తుందనే భ్రమల్లో చంద్రబాబు వున్నాడని అన్నారు. చివరికి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలను చాదస్తంగా ప్రజలు భావించే స్థాయికి, ఆయన అభాసుపాలయ్యే స్థాయికి దిగజారిపోయాడని అన్నారు.

తన అసత్యాలతో ప్రజల్లో ఒక అయోమయాన్ని కలిగించే లక్ష్యంతోనే చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సిపి స్థాపించిన నాటి నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని, ప్రజాసమస్యలే ఎజెండాగా అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనా, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా వంటి ప్రయోజనాలను సాధించుకునే క్రయంలో వైయస్ జగన్ గారు ఎలాంటి ఉద్యమాలు చేశారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నిబద్దత, విశ్వసనీయత, చెప్పినమాట మీద నిలబడే  నైజం వైయస్ జగన్ సొంతమని అన్నారు.

ఇవేవి లేకపోవడం వల్లే చంద్రబాబును, ఆయన పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. చరిత్రలో ఘన విజయాన్ని వైయస్‌ఆర్‌సిపికి కట్టబెట్టారని అన్నారు. ఎన్నికలు జరిగి ఏడాది అవుతోందని, గత ఏడాది వరకు అధికారంలో వుండి ప్రజల పట్ల ఎలా వ్యవహరించారో చంద్రబాబు మరిచిపోయారని అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలు అన్ని మరిచిపోయారని చంద్రబాబు భావించడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. తెలుగు ప్రజలు రాజకీయాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించే విజ్ఞానవంతులనే విషయం చంద్రబాబుకు గుర్తులేదని అన్నారు.

ప్రజలను తన విమర్శలతో భ్రమల్లోకి తీసుకువెళ్ల గలనని చంద్రబాబు భావిస్తున్నాడని అన్నారు. చంద్రబాబు తన ఊహల నుంచి ఇప్పటికైనా బయటకు రావాలని డిమాండ్ చేశారు. 
 
ఈ రాష్ట్రంలో ప్రజల కోసం లెక్కలేనన్ని సార్లు వైయస్ జగన్ నిర్ధిష్టమైన ప్రజాసమస్యలపై నిరాహారదీక్షలు చేశారని,  పోలీసులు అనేక సందర్బాల్లో ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా వున్నాయని అన్నారు.

ప్రజాసమస్యలపై చంద్రబాబు ఏరోజు అయినా పోరాటం చేశారా? ఆయన చేసిన  దీక్షలు ఏమిటీ? ప్రజల పట్ల ఆయనకు వున్న నిబద్దత ఏమిటీ? అని ప్రశ్నించారు. 
 
ఏడాది కాలంలో వైయస్ఆర్‌సిపి ప్రభుత్వం అనేక పథకాలతో రికార్డు సృష్టించిందని అన్నారు. ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వున్న ఎల్లో మీడియాకు చెందిన చానెల్ లో వైయస్‌ఆర్  పేర్లతో వున్న పథకాలపై ఒక కథనాన్ని ప్రసారం చేశారని, దానిలో గుక్కతిప్పుకోకుండా వైయస్ఆర్ పేరును చదివారని అన్నారు.

ప్రజల కోసం ఆలోచించే నాయకుడిగా, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించిన నాయకుడిగా పనిచేసిన వైయస్ఆర్ మాకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని అన్నారు. ఆయన పేరుతో పథకాలను అమలు చేస్తుంటే, చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట అని అని ప్రశ్నించారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోతే తెలుగురాష్ట్రాల్లో వందలాది గుండెలు ఆగిపోయాయని, అదీ ఆయన పట్ల ప్రజలకు వున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని అన్నారు. 
 
దేశ చరిత్రలోనే మేనిఫేస్టోలో చెప్పినవి ఏడాదిలోనే దాదాపుగా తొంబైశాతం వరకు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు పాలనలో  కేవలం అవినీతి కోసమే పథకాలను పెట్టారని, ఆ పథకాల పేరుతో ఎలా అవినీతి సొమ్మును దండుకున్నారని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, ఆస్తులను సృష్టించకుండా అస్తవ్యస్థ పాలన చేశారని విమర్శించారు.

చివరికి ప్రభుత్వం నుంచి తప్పుకునే సమయంలో సుమారు రూ. 2.60 లక్షల కోట్లు అప్పులు మిగల్చారని అన్నారు. ఇవి కాకుండా రూ.40వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.20 వేల కోట్లు పవర్ బకాయిలు పెట్టి వెళ్లిపోయిన చరిత్ర చంద్రబాబుదేనని అన్నారు.
 
వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మే అమలు చేస్తున్న సంక్షేమపథకాల గురించి ప్రతి ఒక్కరూ చెబుతారని అన్నారు. కేవలం పదమూడు నెలల కాలంలో రైతుభరోసా కిందనే సుమారు రూ.10,300 కోట్లు ఖర్చు చేసిన ఘనత మాదేనని అన్నారు. రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్ళలో ఇచ్చింది కేవలం రూ.15వేల కోట్లు మాత్రమేనని అన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో గత నాలుగైదు నెలల్లోనే సుమారు రూ. 28 వేల కోట్లకు పైగా నగదు బదిలీని వివిధ పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా అందించామని, ఇది అవాస్తవమని చెప్పగలరా అని ప్రశ్నించారు. బహూశా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఇలా సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోలేదని అన్నారు. 
 
తాజాగా అత్యాధునిక పరికరాలతో కూడిన 108, 104 వాహనాలను సీఎంగారు ప్రారంభించారని,  పిహెచ్‌సి ల నుంచి గ్రామస్థాయి వరకు వైద్యులు, వైద్యసేవలు, మందులు వెళ్ళేట్టుగా మా ప్రభుత్వం ప్రజారోగ్యంపై జాగ్రత్తలు తీసుకుందుని అన్నారు. దీనిపై ప్రతిపక్షంగా మీరు మాట్లాడుతూ రూ.300 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు.

గతంలో వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి మీరు ఇచ్చిన జీతాలు ఎంత, ఇప్పుడు మేం ప్రకటించినవి ఎంత అని నిలదీశారు. ఓపెన్ టెండర్లలో అరవందో కు ఈ సర్వీసుల నిర్వహణను అప్పగిస్తే దానిని అవినీతి అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో వైయస్ఆర్ హయాంలో అరవిందో, హెటిరో సంస్థలకు జడ్చెర్ల దగ్గర స్థలాలు ఇచ్చినందుకు దానిపైన తప్పుడు ఆరోపణలు చేసి సిబిఐ కేసులు కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు.

అంతర్జాతీయ స్థాయి కంపెనీల మీద ఈ రకంగా ఆరోపణలు చేయడం, మోకాలుకు, బట్టతలకు ముడివేయడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. ఇక్కడ ఏదో జరిగిపోతోందని జరిగిందని బురదచల్లడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. మా వద్ద పద్దెనిమిది వందల అంబులెన్స్ లు వున్నాయని చంద్రబాబు అనడం విడ్డూరంగా వుందని అన్నారు.

కనీసం జీతాలు ఇవ్వకుండా చేసిన దుర్మార్గంకు నిరసనగా ఉద్యోగులు చేసిన సమ్మెలను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. చంద్రబాబు హయాంలో 108 వాహనాలు అనేకం పాడుపడిపోయి మూలన పడ్డాయని, ప్రజలు ఆపదలో వున్న సమయంలోనూ వాటిని వాలడేని దీనస్థితిని చూశామని అన్నారు.

చంద్రబాబు చెప్పినట్లు నిజంగా 1800 వన్ నాట్ ఎయిట్ వాహనాలు వుంటే అవి ఎక్కడ వున్నాయో, ఆడిట్ చేయిస్తామని అన్నారు.  ఎక్కడైనా దాచిపెట్టారా? లేక ట్రావెల్స్ కు ఇచ్చారా? అని ప్రశ్నించారు. 
 
సీఎం వైయస్ జగన్ తాను ప్రజలకు ఏం చెప్పారో.. వాటి ప్రకారం ఏం చేయాలో అది చేసుకుంటూ పోతున్నారని అన్నారు. మీ వైఫల్యాలను చెబుతూ, మీ మీద విమర్శలు చేస్తూ కాలాన్ని వృధా చేయడం లేదని అన్నారు. మీరు బకాయి పెట్టిన సుమారు రూ.1800 కోట్లు ఫీజురీయాంబర్స్‌మెంట్‌ ను మేం చెల్లించామని అన్నారు.

రూ. 8వేల కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మేం చెల్లించామని గుర్తు చేశారు. సుమారు ఏడు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించామని అన్నారు. మీ హయాంలో నిర్వీర్యం చేసిన ఆరోగ్యశ్రీని మేం మళ్ళీ పటిస్టం చేసి ప్రజలకు చేరువ చేశామని అన్నారు. 
 
వార్డు, గ్రామ సచివాలయాలకు రంగులకు ఈ ప్రభుత్వం రూ.1300 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఇవ్వాల్సిన చోట్ల రూపాయికి అయిదు పైసలు ఇచ్చి, మిగిలింది ఖర్చు చూపడం అలావాటని, దానిప్రకారమే లెక్కలు వేసి మా ప్రభుత్వంపైనా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

వాస్తవానికి రంగులకు మా ప్రభుత్వం  30 నుంచి 35 కోట్ల వరకు ఖర్చుచేసి వుండవచ్చని, దానిని రూ.1300 కోట్లు అని అనడం చంద్రబాబుకే చెల్లుతుందని అన్నారు. పోలవరం ట్రిప్పులు, ధర్మపోరాటదీక్షల పేరుతో ఆనాడు విచ్చలవిడిగా ఖర్చు చేసిన తమ అనుభవంతో తమలాగే ఇతరులు కూడా అలాగే చేస్తారనే అంచనాలతో ఈరకంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. 
 
మా హయాంలో జరిగిన అవినీతిని నిరూపించాలని అనేకసార్లు తెలుగుదేశం నాయకులు సవాల్ చేశారని అన్నారు. ఈ రోజున అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్ రెడ్డిలు అవినీతి, అక్రమాల వల్ల అరెస్ట్ అయితే రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా వుందని అన్నారు.

ఇఎస్‌ఐ అవినీతిలో భాగంగానే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడని,  వెంటిలేటర్ పై వున్న పేషంట్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చారనే తీరుగా, ప్రపంచంలో లేని ఎవరికీ లేని వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు చంద్రబాబు, టిడిపి నేతలు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడి అవినీతికి, బిసిలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రెండు వారాల పాటు అచ్చెన్నాయుడుని ఆసుపత్రిలో వుంచి వైద్యం అందించామని, ఇది కక్షసాధించు చర్యగా కపినిస్తోందా అని ప్రశ్నించారు. 
 
గతంలో ప్రతిపక్ష నేతగా వున్న వైయస్ జగన్ ను వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఎలా ఆపారు... ఆయపై దాడి జరిగినప్పుడు పైశాచిక ఆనందంతో డిజిపిని పంపి ఆయనే అభిమానంతో పోడిపించుకున్నారని ఎలా చెప్పించారో చంద్రబాబు మరిచిపోయారని అన్నారు.

గుంటూరు జిల్లాలో టిజి కృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించారని, మహిళానేత రోజాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీస్ వాహనాల్లో ఎక్కించి ఎక్కడకు తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా ఎలా వేధించారో ప్రజలకు తెలుసునని అన్నారు. మీ హయాంలో మాపైన పెట్టిన కేసులు వందలు, వేలు... మీరు చేసిన అరాచకాలు ఎన్నో వున్నాయని అన్నారు.

కానీ మీలాగే మేం ఎక్కడా ఇలా చేయడం లేదని,  మీలాగే చేస్తే అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో ఎలా వుండేవాడని ప్రశ్నించారు.  జగన్‌ పాలనలో పారదర్శకత, సంతృప్తస్థాయి వరకు పథకాలను తీసుకువెళ్ళడం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత వుందని అన్నారు. నిబంధనలను సడలించడం, అర్హత వున్నవారు ఏడాదిలో ఎప్పుడైనా సరే ప్రభుత్వ పథకాలను పొందే విధంగా తన పాలనలో మార్పులు తీసుకువచ్చారని అన్నారు.

సంతృప్తస్థాయి, సోషల్ ఆడిట్, పారదర్శకతలతో మేం ముందుకు పోతున్నామని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో మీరు చేసిన ఘోరాలు, అన్యాయాలకు భిన్నంగా మా పాలన కొనసాగుతోందని తెలిపారు. 
 
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను కూడా రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో పార్టీ రంగు అయిన పసుపును అన్నా క్యాంటీన్ల నుంచి మరుగుదొడ్ల వరకు వేశారని, చివరికి సులబ్ కాంప్లెక్స్ లకు కూడా చంద్రబాబు బొమ్మలు వేశారని గుర్తు చేశారు.

కరెంట్ స్థంబాలకు, శ్మశానాలకు, చివరికి వాళ్ళ మొహాలకు కూడా పసుపు రంగులు వేసుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. ఇటువంటి చిల్లర విషయాలపై మేం ఏనాడు పట్టించుకోలేదని, వున్న ఏడురంగుల్లో ఏది బాగుంటాయో చూసి అవి వేశామని అన్నారు. టిడిపి వ్యవహరిస్తున్న తీరుతో మళ్ళీ వంద జన్మలు ఎత్తినా... చంద్రబాబు, లోకేష్ ఎన్ని చెసినా అధికారంలోకి రాలేరని అన్నారు.

ఇప్పుడు వచ్చిన 23 సీట్లు  కాస్తా చివరికి రెండుగా మారుతాయని అన్నారు.  ఎప్పుడో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పదేళ్ళపాటు బాగుండి, చంద్రబాబు రావడంతో పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ప్రజలు అనుకునే పరిస్థితి మీకు వస్తుందని హెచ్చరించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా లోపాలు వుంటే ఎత్తి చూపాలని హితవు పలికారు. అందుకు భిన్నంగా తప్పుడు విమర్శలతోనే ప్రజల్లో భ్రమలు కల్పించాలని అనుకుంటే... ఇదే మా ప్రపంచం అని అనుకుంటే...వెంటిలేటర్ పై వున్న టిడిపికి మరింత పతనం తప్పదని అన్నారు. 
 
వైయస్‌ఆర్‌సిపి ప్రారంభమైన నాటి నుంచి పనిచేస్తున్న మాకు పార్టీ బాధ్యతలను అప్పగించడంపైన కూడా విమర్శలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మా పార్టీ పుట్టుక నుంచి ఒక వ్యక్తిగా మొదలై, వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులతో విస్తరించిందని అన్నారు.

ఈరోజున ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా వుండటం వల్ల పార్టీ వ్యవహారాల సమన్వయం కోసం మాకు కొన్ని బాధ్యతలను అప్పగించారని, దానిని ఎంతో జవాబుదారీతనంతో మేం స్వీకరించామని అన్నారు. లోకేష్ లాగా తన తండ్రి అధికారంను అడ్డం పెట్టుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పదవులను పొందలేదని అన్నారు. 
 
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు లీజుల పొడిగింపు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరిగిందని దానిపైన కూడా చంద్రబాబు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అప్పటి ప్రభుత్వం అధికార  దుర్వినియోగంతో లీజులు రద్దు చేసిందని, ఈ రోజు తిరిగి వాటిని పునరుద్దరించడం, ముప్పై నుంచి యాబై ఏళ్ళకు లీజు గడువు పెంచడం కూడా పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరిగినవేనని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు