ఏపీలో ఒమైక్రాన్‌ కలకలం... ఐర్లాండ్‌ నుంచి శృంగవరపుకోటకు!

మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:26 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ రాష్ట్రంలోనూ కలకలం రేపింది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. 
 
 
జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఎస్‌.కోట మండలంలోని అత్తవారింటికి వచ్చాడు.  ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వడంతో మూడు రోజుల కిందట వైద్య సిబ్బంది వచ్చి ఆ వ్యక్తితోపాటు, ఆయన భార్య, అత్త నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్షించగా, ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు  రిపోర్టు వచ్చింది. 
 
 
ఒమైక్రాన్ అనే అనుమానంతో శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. హోం క్వారెంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. ఆయన పట్టించుకోకుండా.. వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం మధురువాడ వెళినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు