ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలనూ అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. దీంతో కరకట్ట వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
దాంతో పోలీసులు వారిని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు మాజి మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు వున్నారు.
అమరావతిలో ప్రజా రాజధానిని జగన్ కూల్చి ఏడాది అవుతున్నది. శుభకార్యంతో పాలన ప్రారంభించకుండా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారు. తర్వాత అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పండ్ల చెట్లు నరికి వేశారు. కావలిలో ఉపరాష్ట్రపతి ప్రారంభించిన శిలాఫలకాన్ని కూల్చివేశారు. విజయవాడలో అవతార్ పార్క్ ను ధ్వంసం చేశారు.
అనంతపురం జిల్లా పేరూరులో చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం చేశారు. నెల్లూరులో పేదల ఇళ్లను కూల్చివేశారు. మడకశిరలో ఇళ్లు కూల్చివేశారు. మాచర్లలో ఇళ్లు కూల్చివేశారు. నర్సరావుపేటలో అన్న క్యాంటీన్ కూల్చి వేశారు. ఇలా ఆస్తులు కూల్చి వేయడం, శిలా ఫలకాలు కూల్చివేయడం, భూములు, గనులు కబ్జా చేయడం, ప్రశ్నించిన ప్రతిపక్షాలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్ట్ లు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి.
నేడు కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించడానికి వెళ్తున్న వర్లరామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్,అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, పిల్లి మాణిక్యారావు తదితర నాయకుల అక్రమ అరెస్ట్ లను ప్రజలు, మేధావులు ఖండించాలి.