గుంటూరు: నవ్యాంధ్రలో ఆన్‌లైన్ మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మోసగాళ్లు బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్ చేసి ఖాతాదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు. అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న మోసగాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. కొంతకాలంగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆన్లైన్ మోసాల్లో ఆరితేరిన నిందితులను పట్టుకోవడం సాధ్యం కావడం లేదు. దీనితో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఖాతాదారులకు ఫోన చేసి అకౌంట్ నంబర్, ఏటీఎం నంబరు తీసుకుంటున్నారు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, నంబరు చెప్తే సరి చేస్తామని ఫోన్లు చేసి నంబరు తీసుకుని క్షణాల వ్యవధిలో ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. మరికొందరు మోసగాళ్లు పలు కంపెనీల పేర్లతో వెబ్‌సైట్లు తెరిచి వస్తువులు విక్రయిస్తున్నట్లు ప్రకటించి ఫొటోలను చూపుతూ, ఆన్ లైన్లో బేరం కుదుర్చుకుంటున్నారు. ఆ వెంటనే సంబంధిత ఎకౌంట్ నుంచి డబ్బు జమ చేయించుకుని కనుమరుగవుతున్నారు.
అంతేకాక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల విషయంలో కూడా బ్యాంకు అధికారుల్లాగే మాట్లాడుతూ, మీ క్రెడిట్ సౌకర్యాన్ని అధికం చేస్తామని చెప్పి వివరాలు సేకరించి పినకోడ్ నంబర్ వేసుకుని కార్డులోని నగదు దోచేస్తున్నారు. ఇటీవల పెదకాకాని, పేరేచర్ల, నల్లపాడు, హౌసింగ్ బోర్డు కాలనీ, లక్ష్మీపురం తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈ తరహా మోసాలకు గురై తమ ఖాతాలో డబ్బు పోగొట్టుకున్నారు. తాజాగా, మేడికొండూరు, పిడుగురాళ్ల వంటి ప్రాంతాల్లో కూడా మోసాలు వెలుగు చూశాయి.
అత్యధిక సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి లబోదిబోమంటూ ఖాతా నెంబరును రద్దు చేసుకుంటున్నారు. దీనిపై పోలీసు అధికారులు ఎన్నిసార్లు హెచ్చకలు జారీ చేసినా ఖాతాదారులు మోసపోతునే ఉన్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని అర్బన ఎస్పీ త్రిపాఠి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.