చిత్తూరు జిల్లాలో ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ స్టార్ట్...

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:29 IST)
చిత్తూరు జిల్లాలోని రామసముద్రంలో రెండో రోజు ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ ప్రారంభమైంది.గత రెండురోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రెండురోజుల క్రితం రామసముద్రంలో ఒక వృద్ధుడిని తొండంతో కొట్టి చంపిన ఏనుగును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒక ఏనుగు పురాండ్లపల్లె, ఎర్రపల్లె, మూగవాడి, ఎం.గొల్లపల్లె, మినికి, రామసముద్రం పొలాల్లో తిరుగుతూ పంట మొత్తాన్ని నష్టం చేసింది. గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు.
 
ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ పేరుతో శిక్షణ ఇచ్చిన రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. సోమవారం రాత్రి వరకు భీభత్సం సృష్టించిన ఏనుగును పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఏనుగు దొరకలేదు. దీంతో చివరి ప్రయత్నంగా మంగళవారం కూడా అటవీశాఖాధికారులు ఏనుగును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు అటవీశాఖాధికారుల వలలో పడితే కర్షాటకలోకి కారంగి అడవివైపు పంపించే ప్రయత్నం చేయనున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి