హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ధర్నా చౌక్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతంగా మారింది. ధర్నా చౌక్‌ను తరలించవద్దని నిరసనకారులు.. ధర్నా చౌక్‌ను తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు.
ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శాంతియుతంగా ఇరు వర్గాలకూ తమ నిరసనను తెలుపుకునేందుకు పోలీసులు అనుమతించగా, ఒకే సమయంలో ధర్నా చౌక్ వద్దకు చేరిన ఇరు వర్గాలు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
జెండా కర్రలతో తమపై దాడులు చేశారని స్థానికులు, బయటి నుంచి గూండాలను తెప్పించి తమపై రాళ్లను రువ్వారని వామపక్షాలవారు పరస్పరం ఆరోపించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం, తోపులాటలతో మొదలైన గొడవ, ఆపై రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది.