ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలకు వెళ్లారు. పవన్ రాకతో పోలీసులు అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆయన ప్రయాణించే మార్గాల్లో ఏ ఒక్క వాహనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా, సోమవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు విశాఖలో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కొందరు విద్యార్థులు బయలుదేరారు. అయితే, పవన్ రాక కారణంగా ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ 30 మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. దీంతో వారు పరీక్షను రాయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ, తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.