శ్రీకాకుళంలో ఘోరం : రోడ్డు ప్రమాదంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ దుర్మరణం

సోమవారం, 14 నవంబరు 2022 (08:38 IST)
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. పలాస ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఆయన కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి వంతెన రక్షణ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా మడే రమేశ్ (45) వైద్యాధికారిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య లక్ష్మి (45), కుమార్తె సైర్య (14), కుమారుడు సంకల్ప్ (10)లు ఉన్నారు. అయితే, వీరంతా ఒక కారులో విశాఖ నుంచి పలాసకు బయలుదేరారు. 
 
ఈ కారు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెదనాయుడు పేట వద్ద జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ సీటులో ఉన్న రమేష్, ఆయన కుమారుడు సంకల్ప్‌లు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, లక్ష్మి, సైర్యలు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన లక్ష్మ సైర్యలను శ్రీకాకుళం ఆస్పత్రి తరలించారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు