ఆంధ్రప్రదేశ్లో వున్న దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా గ్రూపు మహిళలను మద్య నియంత్రణలో భాగస్వాములను చేయాలని కోరుతూ విజయవాడలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి. రాజబాబు ఐఏఎస్ ను కలసి మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
'మద్యం వద్దు.. కుటుంబం ముద్దు' నినాదంతో కుటుంబాలను బాగు చేసుకుందామనే సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి చేరవేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో అనధికార మధ్యాన్ని, షాపులను, అక్రమ మద్యన్ని, గంజాయి, నాటుసారా లాంటి మత్తు పానీయాల వివరాలను 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఇవో పి. రాజబాబు ఐఏఎస్ ప్రసంగిస్తూ మద్య నియంత్రణ ఉద్యమంలో రాష్ట్ర మహిళలు ప్రధాన భూమిక వహిస్తారన్నారు. డ్వాక్రా మహిళలు పొదుపు కార్యక్రమాలతోపాటు మద్యం దుష్ఫలితాలపై చర్చించి, మద్య రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తారని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మద్య నియంత్రణపై చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా లిక్కర్ వినియోగం 40శాతం, బీరు వినియోగం 60 శాతం తగ్గటం హర్షణీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు గ్రూపుల లో మద్యం దుష్ఫలితాల పై చర్చించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.