ముంపు ప్రాంతాల్లో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీసీసీ

గురువారం, 15 అక్టోబరు 2020 (08:08 IST)
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఏపిసిసి అధ్యక్షులు డాక్ట‌ర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఆయన ఒక ప్రకటన చేస్తూ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా ముంపున‌కు గుర‌య్యాయ‌ని తెలిపారు. రైతులు హాహాకారాలు చేస్తూంటే ప్రభుత్వం తగిన చర్యలు, సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమవుతుంద‌న్నారు.

ముఖ్యంగా వాగులు, వంకలు పొంగడంతో పంట పొలాలే కాక ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ఆయా జిల్లాల్లో వందలాది మంది నిరాశ్రయుల‌య్యార‌ని అన్నారు. అలాగే వ‌ర్షాల‌కు కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగిప‌డి ప‌లువురు గాయాలపాలయ్యారన్నారు.

వర్షాలు నేప‌ధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వారిని తరలించడం ముందస్తు హెచ్చరికలు ప్ర‌‌భుత్వం చేయలేదన్నారు. ఇప్పటికైనా గృహాలు కోల్పోయిన వారికి, నీటమునిగిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలన్నారు. 
 
బాధితులను ఆదుకోవాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు... 
రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను మన వంతు సాయంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు నిరాశ్రయులైన బాధితులకు తిండి, ఆశ్రయం కల్పించడంలో అధికారులతో మాట్లాడి తగిన సహాయం చేయాలన్నారు.

అలాగే బాధితులకు వీలైనంత వ్యక్తిగత సాయం కూడా చేయాలన్నారు. భారీ వర్షాలు మరిన్ని రోజులు పడే అవకాశం ఉన్నందున ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే విధంగా ప్ర‌జ‌ల్లో చైతన్యం కల్పించి, అధికారులను అప్రమత్తం చేయాలని శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు