అన్నయ్య రాజకీయాల్లో కొనసాగివున్నట్టయితే సీఎం ఆయనే (video)

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (09:59 IST)
తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగివున్నట్టయితే ఇపుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయివుండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే... ఇప్పుడు సీఎం అయ్యేవారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని, అదొక బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నివర్ తుఫాను బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. 
 
అక్కడి పోయ గ్రామంలో నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుంటారు. అనంతరం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తారు. 11 గంటలకు నాయుడుపేట చేరుకుంటారు. 
 
అక్కడ రైతులను కలుసుకుని పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు.
 
అంతకుముందు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే... ఇప్పుడు సీఎం అయ్యేవారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని, అదొక బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
జనాలపై అజమాయిషీ చేసేందుకే అధికారమని ఇప్పుడు అనుకుంటున్నారన్నారు. ఇసుక అమ్ముకోవడానికో, సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, మద్యం అమ్ముకోవడానికో తాను ముఖ్యమంత్రి కావాలనుకోలేదని చెప్పారు. వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా బాధ్యత వహించాలని, మరోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకోవాలని సూచించారు.
 
మిగిలిన వారు 25 కేజీల బియ్యం ఇస్తామంటున్నారని... తాను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నానని పవన్ చెప్పారు. సెల్ఫీ తీసుకోలేదని, ఫొటో తీసుకోలేదని తనపై కోపం చూపించవద్దని అభిమానులను కోరారు. 
 
అమరావతి రైతుల కోసం లాఠీలను దాటుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇతర రాజకీయ నేతల మాదిరి తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలు లేవని... అందుకే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.
 
కాగా, పవన్ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ, కేవలం సినిమాలకే పరిమితమైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు