ఢిల్లీ టూర్‌లో జనసేనాని.. బీజేపీ పెద్దలతో భేటీ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై..?

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:49 IST)
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. పవన్‌ వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీ బాట పట్టారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వంతో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారు. అంతేగాకుండా ప్రధానంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. 
 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. నడ్డా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో పవన్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 
 
రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించు కోవాలని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్రం నిర్ణయంపై ఇప్పటికే సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయాన్ని నడ్డా దృష్టికి తీసుకురానున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ కలిశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం‌ చేయవద్దంటూ అమిత్ షాకు వినతి పత్రం అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు