భావోద్వేగానికి గురైన పవన్‌ కళ్యాణ్‌...

మంగళవారం, 17 జనవరి 2017 (19:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండటానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మనస్పూర్తిగా స్వచ్చంధంగా ముందుకు వచ్చాడు. తెలంగాణ, ఆంధ్రాలలో నేత కార్మికుల కష్టాలను విని చలించిపోయారు. తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ను మంగళవారం సాయంత్రం కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలిచావులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
 
వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్‌ను వారు కోరారు. అందుకు కళ్యాన్‌ అంగీకరించారని జనసేన పార్టీ కార్యాలయం మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ పేరున పార్టీ లెటర్‌ విడుదల చేసింది. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. నేత కళ మన జాతి సంపద అని భావోద్వేగం చెందుతూ అన్నారు. దీనిని రక్షించుకునే బాధ్యత మన అందరిదీ అని పేర్కొన్నారు. నేత కుటుంబాలను ఆదుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌ల్యూమ్‌ బోర్డు సభ్యుడు ఎఎన్‌ మూర్తి, ఐక్య వేదిక కన్వీనర్‌ కూరపాటి రమేష్‌ తదితరులు పాల్గొని వినతి పత్రాలు సమర్పించారు.

వెబ్దునియా పై చదవండి