ప్రస్తుత రాజకీయాల్లో సత్యం మాట్లాడితేనే శత్రువులవుతారు అంటూ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో ఆ పార్టీకి చెందిన జనసేన పార్టీకి చెందిన ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన రాజకీయాలపై తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.... 'సాధారణంగా రాజకీయాల్లో ఎవరికీ వ్యక్తిగత శత్రువులు ఉండరు. కానీ, సత్యం (నిజం) మాట్లాడితేనే శత్రువులు వస్తారు. చివరకు సత్యం మాత్రమే గెలుస్తుంది. సమకాలీన రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే... మాట్లాడకుండా వారికి ఊడిగం చేయాలని కోరుకొంటున్నారు. అది ఇక కుదరదని స్పష్టం చేశారు.
పైగా, కులప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్నారు. సమాజాన్ని సమగ్రంగా చూసే విధానం రావాలి. నేను తప్పు చేసినా... ఓ జనసేన కార్యకర్త అవినీతి చేసినా వెనకేసుకు రావద్దు.. ఖండించాలి. సింగపూర్ తరహా పాలన అంటే అక్కడ తప్పు చేస్తే తనవాళ్ళనైనా శిక్షిస్తారు. ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనుకోవద్దు. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. నోట్ల రద్దు తరవాత ఎన్నో ఇబ్బందులు జనం పడితే... ఉత్తర ప్రదేశ్ కి ఎక్కువ నోట్లు పంపించారు. జనం గమనిస్తూనే ఉన్నారు. ఓటు ద్వారా సామాజిక మార్పు తీసుకువద్దాం' అని ఎన్నారైలకు పిలుపునిచ్చారు.