చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని, వారానికి ఓసారి చేనేత వస్త్రాలను ధరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. చేనేత జాతి సంపద అని.. అదో అరుదైన కళంటూ హైదరాబాదు పార్టీ ఆఫీసులో పవన్ వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగనున్న చేనేత సత్యాగ్రహానికి ముఖ్యఅతిథిగా చేనేత సంఘాలు తనను ఆహ్వానించాయని పవన్ తెలిపారు. తనకు చేతనైనంత వరకు ఇకపై వారంలో ఓ రోజు చేనేత దుస్తులే ధరిస్తానని.. తనలాగే మీరందరూ కూడా వారానికి ఓసారి చేనేత దుస్తులను ధరించాలని సూచించారు.
మిలాన్ లాంటి నగరంలో కశ్మీరీ వర్క్‌ను డిజైనర్లు కొనుగోలు చేస్తారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగల మనవారి నైపుణ్యం వారికి అవసరం ఉంటుందని భావిస్తున్నానని, అలా చేనేతను అంతర్జాతీయ బ్రాండ్‌గా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందుకోసం తన వంతు సాయం చేస్తానని పవన్ చెప్పారు. చేనేత జాతి సంపదని అలాంటి సత్యాగ్రహ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన వారందరికీ ఈ సందర్భంగా పవన్ ధన్యవాదాలు తెలిపారు.