అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు.. పోరాటం చేయరు.. చేయనివ్వరు మరి ఎలా? పవన్

బుధవారం, 25 జనవరి 2017 (14:48 IST)
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్కే బీచ్‌లో ఉద్యమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోరాటానికి ప్రభుత్వానికి చెందిన మంత్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఏపీ డీజీపీ కూడా ఆర్కే బీచ్‌లో ఇలాంటి ఉద్యమాలను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మరికొందరైతే దేశం గర్వించదగిన రిపబ్లిక్ డే రోజున ఇలాంటి ఉద్యమాలు ఏమాత్రం బాగోవంటున్నారు. అయితే వీరిపై ట్విట్టర్ ద్వారా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎండగడుతున్నారు.
 
ప్రత్యేకహోదాపై ప‌వ‌న్ బుధవారం ఉదయం నుంచి గంట గంటకూ ట్వీట్ చేస్తూ ఆర్కే బీచ్ ఉద్యమంపై నిరసన వ్యక్తం చేసేవారిపై మండిపడుతున్నారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని సూచిస్తూ.. హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల తీరుని ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా ప‌వ‌న్ ‘యువత చెయ్యాలనుకుంటున్న ఏపీ ప్రత్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరుకార్చినా, వారు రాష్ట్రయువత భవిష్యత్తుని నాశనం చెయ్యటమే...అని పవన్ పేర్కొన్నారు.
 
ప్రత్యేక హోదాపై ట్విట్టర్ ద్వారా ప్రజా ప్రతినిధుల వైఖరిపై పవన్ మండిపడ్డారు. "అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెతలాగ, ఏపీ స్పెషల్ స్టేటస్ కి మీరు పోరాటం చెయ్యరు, చేసే వారిని చెయ్యనివ్వరు... మరి ఎలా?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, గురువారం విశాఖపట్నం ఆర్కే బీచ్, విజయవాడ కృష్ణా తీరం, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణాల్లో యువత ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు నిర్ణయించగా, అందుకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే
 
ఈ నేపథ్యంలో జనసేనాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేశారు. బాబును టార్గెట్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం ఏంటని బాబును పవన్ ప్రశ్నించారు. జల్లికట్టు స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే యువతకు సహకరించాలని పవన్ కోరారు. అంతేకానీ, వెనక్కిలాగే వ్యాఖ్యలు చేయకండని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి