ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ, రాష్ట్రంలో అపుడే పొత్తుల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వైకాపా నేతలు సవాళ్ళు విసురుతున్నారు. పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ వైకాపా నేతలు పోటీపడుతూ రంకెలు వేస్తున్నారు. వీరికి పవన్ కల్యాణ్ కూల్‌గా సమాధానమిచ్చారు. తనను ఒంటరిగా పోటీ చేయమనడానికి వైకాపా నేతలు ఎవరు అంటూ సూటిగా సుత్తిలేకుండా ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చింది ప్రజలను హింసించడానికా అంటూ నిలదీశారు. ఈ దఫా 15 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
ఆయన ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని, వ్యూహాలు, ఎత్తుగడలే ఉంటాయని వైకాపా నేతలకు తెలియజెప్పారు. జనసేనను ఒంటరిగా పోటీ చేయాలని అడిగేందుకు మీరు ఎవరు అంటూ ఆయన నిలదీశారు. ప్రజలు కన్నీటిని తుడవని ప్రభుత్వం ఎందుకు అని చెప్పారు.
రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్నారు. తనపై కేసులు లేవు గనుక ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడానని చెప్పారు. ఇతరుల జెండాలు, అజెండాలు మోయబోనని స్పష్టం చేశారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలితో రాష్ట్రానికి అంధకారమేనని చెప్పారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుకే మీ తరపున పోరాడేందుకు తనను ఆశీర్వదించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.