కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలోని డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్లలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆందోళన ఉద్ధృతం కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డీసీఐ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. బుధవారం నుంచి జరుగనున్న సమ్మెలో పవన్ పాల్గొంటారని తెలిసింది.
వెంకటేష్ ఆత్మహత్యతో ఆందోళన తీవ్రతరమవుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం పవన్ విశాఖకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని.. ఆందోళనకు పవన్ మద్దతు తెలుపుతారని సమాచారం. కాగా, పవన్ కల్యాణ్ విశాఖపట్నంతో పాటు విజయనగరంలోనూ మొత్తం మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలతోనూ సమావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాల సమాచారం.