గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

ఠాగూర్

శుక్రవారం, 4 జులై 2025 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆదివాసీ గిరిజనులపై తనకున్న ప్రత్యేక అభిమానం, ఆత్మీయతను మరోమారు చాటుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పరిధిలోని కురిడి గ్రామస్థుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్దతుల్లో పండించిన మామిడి పండ్లను ప్రేమతో బహుమతిగా పంపించారు. 
 
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం ప్రత్యేక వాహనంలో మామిడి పండ్లను కురిడి గ్రామానికి తీసుకెళ్లారు. గ్రామంలో ఉన్న 230 గిరిజన కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఇంటికి అరడజను చొప్పున మామిడి పండ్లను పంపిణీ చేశారు. 
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పంపిన మామిడిపండ్లను అందుకున్న గ్రామస్థులు, చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మా పవన్ సారు పంపిన మామిడి పండ్లు అంటూ వారు ఎంతో ప్రేమగా వాటిని చూపించారు. ఇంతటి ప్రేమాభిమానాలు చూపిన పవన్ కళ్యాణ్  చల్లగా ఉండాలని వారు మనసారా ఆశీర్వదించారు. 
 
ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కురిడి గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో గ్రామస్థుల కష్టాలను అడిగి తెలుసుకుని, రహదారి నిర్మాణ పనులనకు శంకుస్థాపన చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ పర్యటన సందర్భంగా ఏర్పడిన అనుబంధంతోనే ఇపుడు వారికి తన తోటలోని మామిడి పండ్లను పంపించి తన మాట నిలబెట్టుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు