జనసేన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని తెగేసి చెప్పాడు. తనపై విమర్శలు చేసేవారి వ్యక్తిగత జీవితాల గురించి తాను కూడా చాలా మాట్లాడగలనని పవన్ అన్నారు. అంతేకాదు చంద్రబాబును ఎదుర్కోలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు.
'జగన్ ఏదైనా తాను సీఎం అయ్యాకే చేస్తామంటారు. ఆయనలాగా మాకు ఎమ్మెల్యేలు ఉంటే.. అసెంబ్లీని ఒక ఊపు ఊపేవాడిని. సీఎంను ఎదుర్కొనే దమ్ములేక, శక్తిలేక పారిపోతున్నారు. ఆయన చేసిన వ్యక్తిగత విమర్శలను తట్టుకోగలను. నేను గుండెల్లో అగ్ని గోళాలు పెట్టుకుని తిరుగుతున్నాను. నన్ను రెచ్చగొట్టకండి' అంటూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
జగన్‌లాగా కుసంస్కారిని కానని.. ఫ్యాక్షనిజం, బాంబులు, బరిసెలు, వేటకొడవళ్లకు భయపడే వాడిని కానని పునరుద్ఘాటించారు. నా జీవితం తెరిచిన పుస్తకం. మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని నన్ను, అసలు పెళ్లే కాలేదని రాహుల్‌ను విమర్శిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. నేను వ్యక్తిగతంగా వెళితే మీరు ఊపిరి పీల్చుకోలేరు. తట్టుకోలేరు, పారిపోతారు అంటూ ధ్వజమెత్తారు.