2019లో జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే...? ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

శనివారం, 2 మార్చి 2019 (22:05 IST)
రాయ‌ల‌సీమ నాయ‌కుల‌ను జ‌న సైనికులు త‌ట్టుకోలేరు, భ‌య‌ప‌డుతున్నారు అంటే ఒక‌టే చెప్పాను అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ... అంద‌రం పీల్చేది ఒక‌టే గాలి, తినేది ఒక‌టే తిండి. తాగేది ఒకే నీళ్లు. నాయ‌కుల ద‌గ్గ‌ర ఏముందో మ‌న ద‌గ్గ‌ర అదే ఉంది.

మీకు కావాల్సిందల్లా మీలో వాళ్ల‌ను ఎదిరించే ధైర్యం ఉంద‌ని గుర్తించ‌డ‌మే అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. వాళ్ల‌ను ఎదిరించే ధైర్యం మీకుంద‌ని నేను గుర్తిస్తున్నాను. వాళ్లు చంపేస్తాం అని భ‌య‌పెడితే జ‌న‌సేన జెండా ప‌ట్టుకోకండి. కానీ గుండెల్లో జెండాను మాత్రం ఎగ‌ర‌వేయండి. ఏ కుటుంబానికి ఎవ‌రూ దాసోహులు కాదు. ఇది ప్ర‌జాస్వామ్యం. అంబేద్క‌ర్ క‌ల‌ల‌గ‌న్న ప్ర‌జాస్వామ్యం ఇది. 
 
కాన్షీరాంను ముందుకు తీసుకెళ్లిన ప్ర‌జాస్వామ్యం ఇది. ఎంతోమంది ప్రాణాలు వ‌దిలి తీసుకొచ్చిన‌ ప్ర‌జాస్వామ్యం ఇది. కిరాయి మూక‌లు, ప్రైవేటు సైన్యాన్ని చూసి ప్రజాస్వామ్యాన్ని తాక‌ట్టు పెట్ట‌కండి. అలా అని రోడ్ల‌ మీద‌కు వ‌చ్చి గొడ‌వ‌లు పెట్టుకోకండి. ప్రాణాలు ప‌ణంగా పెట్ట‌కండి. నాకు జ‌న సైనికుల ప్రాణాలు ముఖ్య‌మా..? లేక గెలుపు ముఖ్య‌మా అని అడిగితే.. నేను ఓడిపోవ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌తాను కానీ జ‌న సైనికుల ప్రాణాలు ప‌ణంగా పెట్ట‌డానికి సిద్ధంగా లేను అని చెబుతాను. జ‌న‌సేన పార్టీలోకి వ‌చ్చే నాయ‌కులు ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి, మావాళ్ల‌ను ర‌క్షించుకునే విధంగా ఉండాలి త‌ప్ప .. వారి తలపై ఎక్కి తొక్కుతానంటే చూస్తూ ఊరుకోం. 
 
రాయ‌ల‌సీమ‌లో ప‌రిశ్ర‌మ‌లు పెట్టాలంటే పారిశ్రామికవేత్త‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఎవ‌రొచ్చి కొడ‌తారేమోన‌ని. అలా అయితే ఇక్క‌డ చ‌దువుకున్న యువ‌త‌కు ఉద్యోగాలు ఎలా వ‌స్తాయి..? పిరికిత‌నంతో నాయ‌కుల మోచేతి నీళ్లు తాగి బ‌తికేద్దామా..? లేక‌ త‌లెత్తి గుండెలు ఎగ‌రేసి ముందుకెళ్దామా..? మీరే ఆలోచించుకోండి..? నేను మాత్రం రెండో దారిలోనే వెళ్తాను. కులాలు, మ‌తాల‌కు అతీతంగా మార్పు తీసుకొస్తాం. న‌న్ను వెన‌క్కి లాగే మాట‌లు నాకు న‌చ్చ‌వు. నేను ముందుకెళ్లే మాట‌లే వింటాను. ల‌క్ష మంది పిరికివాళ్లు అవ‌స‌రం లేదు. ఒక్క ధైర్య‌వంతుడు చాలు. రాజ‌కీయాలంటే బ్ర‌హ్మ‌విద్య‌లా చూపించారు. రాజ‌కీయాలు అంటే స‌ర్వ‌సాధార‌ణ విద్యే. 25 సంవ‌త్స‌రాల పోరాటానికి సిద్ధ‌మైతేనే జ‌న‌సేన పార్టీలోకి రండి. 
 
ఒక త‌రాన్ని మార్చ‌డం కోసం వ‌చ్చాను. నా వృత్తి సినిమా అయితే.. నా ప్ర‌వృతి స‌మాజ సేవ‌. ల‌క్ష కోట్ల బ‌డ్జెట్ ఉంటే అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల్లా 5 ల‌క్ష‌ల కోట్ల హామీలు ఇవ్వ‌ను. మేము అమ‌లు చేయ‌గ‌లిగిందే చెబుతాం. 2019లో జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే నాణ్య‌మైన విద్య‌, వైద్యాన్ని ఉచితంగా అందిస్తాం. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల‌ను పెంచ‌డంతో పాటు ఎంపీ కొడుకు కూడా వెళ్లి చ‌దువుకునే స్థాయికి పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేస్తాం. 
 
టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం. పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కాదు లాభ‌సాటి ధ‌ర క‌ల్పిస్తాం. మహిళ‌ల‌కు ఉచిత గ్యాస్‌తో పాటు రేష‌న్‌కు బ‌దులు వారి ఖాతాల్లో రూ. 2500 నుంచి రూ. 3500 న‌గ‌దు జ‌మ చేస్తాం. క‌డ‌ప ప‌ర్య‌ట‌న చాలా సంతృప్తినిచ్చింది. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌"ని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు