ప్రత్యేక హోదా కోసం యువత కదిలితే వెనుక నిలుస్తా: పవన్ కల్యాణ్

సోమవారం, 23 జనవరి 2017 (09:50 IST)
రాష్ట్ర విభజన హామీ మేరకు విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను దక్కించుకునేందుకు యువత ముందుకు వచ్చి పోరాటం చేస్తే తాను వారికి అండగా నిలుస్తానని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ యువత జనవరి 26న వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిశ్శబ్ద నిరసనకు ప్రణాళికలు రచిస్తే.. జనసేన వారికి పూర్తిగా మద్దతిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. 
 
ఈ నెల 26న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో యువత మౌన నిరసన దీక్ష చేపడితే, జనసేన దానికి మద్దతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు గత రాత్రి ట్వీట్లు చేశారు. అవకాశవాద, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్‌ను జనసేన విడుదల చేయనుందని తెలిపారు. 
 
'దేశ్ బచావో' పేరిట ఈ ఆల్బమ్ ఉంటుందని, దీన్ని జనవరి 24న విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని పవన్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి